పత్తి విక్రయాలు సీసీఐ కేంద్రాల ద్వారానే చేయాలి – జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్

పత్తి విక్రయాలు సీసీఐ కేంద్రాల ద్వారానే చేయాలి – జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్

భద్రాద్రి కొత్తగూడెం: రైతులు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ఏర్పాటైన పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే తమ ఉత్పత్తిని విక్రయించాలంటూ జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్ సూచించారు. శనివారం సుజాతనగర్ మండలంలోని డేగలమడుగు గ్రామంలో ఉన్న గిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పత్తి తేమశాతం, తూకం, విక్రయ ధర తదితర ప్రక్రియలను పరిశీలించిన సురేంద్రమోహన్ మాట్లాడుతూ, సీసీఐ ప్రమాణాల ప్రకారం తేమ శాతం 8 నుంచి 12 శాతం మధ్య ఉండే విధంగా పత్తిని మార్కెట్ కు తీసుకురావాలని రైతులకు సూచించారు. అంతేకాకుండా, తూకం మరియు ఇతర విషయాల్లో పారదర్శకత ఉండేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) క్వింటాకు రూ. 7521 చెల్లింపుగా రైతులకు అందించాలని సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా సీసీఐ కేంద్రాల వద్దే విక్రయాలు జరిపి, న్యాయమైన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులను ఆదేశించారు. వాట్సప్ చాట్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులను రెండు పని దినాల్లో పరిష్కరించాలనీ, రైతులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సరైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌర సరఫరాల అధికారి త్రినాథ్ బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *