అశ్వాపురం మండలంలో సిసి రోడ్లను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
తేదీ: 14.11.2024, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం
అశ్వాపురం మండల పర్యటనలో భాగంగా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై సీతారామపురం మరియు ఆనందపురం గ్రామ పంచాయతీలలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమైన సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే పాయంను శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే పాయం రిబ్బన్ కట్ చేసి సిసి రోడ్లను ప్రారంభించిన అనంతరం గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తేవగా, సంబంధిత అధికారులకు వాటిని త్వరగా పరిష్కరించేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల నిర్మాణంతో గ్రామాల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో గ్రామస్తులు ఎమ్మెల్యే పాయంను కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, అశ్వాపురం మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.