నిషేధిత మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న చర్ల పోలీస్, స్పెషల్ పార్టీ మరియు CRPF 141 ‘C’ బలగాలు
మహానది న్యూస్ , చర్ల మండలం 11,నవంబర్2024, తాలిపేరు డ్యామ్ సమీపంలో టేకు ప్లాంటేషన్ అడవి ప్రాంతంలో నిషేధిత మావోయిస్టు కార్యకలాపాలపై ఏరియా డామినేషన్ నిర్వహణలో ఉన్న చర్ల పోలీస్, స్పెషల్ పార్టీ మరియు CRPF 141 ‘C’ బలగాలు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక వ్యక్తి వద్ద ప్లాస్టిక్ సంచిని తనిఖీ చేయగా, అందులో ఎలక్ట్రికల్ వైర్లతో కలిగి ఉన్న ప్రెషర్ కుక్కర్ బాంబు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, ఈ వ్యక్తులు నిషేధిత మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా పని చేస్తున్నట్లు తేలింది.
పట్టుబడిన వారి వివరాలు:
- మడకం దేవ @ రింకు (25 సంవత్సరాలు, వ్యవసాయం), చెన్నాపురం గ్రామం, చర్ల మండలం
- సోడి ఉంగ (25 సంవత్సరాలు, వ్యవసాయం), చెన్నాపురం గ్రామం, చర్ల మండలం
- సోడి కొస (21 సంవత్సరాలు, వ్యవసాయం), చెన్నాపురం గ్రామం, చర్ల మండలం
- మడకం ఇడుమ @ గాండ (21 సంవత్సరాలు, వ్యవసాయం), చెన్నాపురం గ్రామం, చర్ల మండలం
- కలుమ అడుమ (29 సంవత్సరాలు, వ్యవసాయం), చెన్నాపురం గ్రామం, చర్ల మండలం
- కొవ్వాసి భీమయ్య (35 సంవత్సరాలు, వ్యవసాయం), చెన్నాపురం గ్రామం, చర్ల మండలం
ఈ వ్యక్తులు నిషేధిత మావోయిస్ట్ పార్టీ నాయకుల ఆదేశాల మేరకు భద్రతా బలగాలను హతమార్చే ఉద్దేశంతో పేలుడు పదార్థాలను ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో, 17.10.2024న గోరుకొండ వద్ద పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు కూడా దర్యాప్తులో వెల్లడైంది. నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులు, సభ్యులు తమ గత అజ్ఞాత జీవనాన్ని విడిచిపెట్టి స్వచ్ఛందంగా పోలీసు అధికారులకు లొంగి జనజీవన స్రవంతిలో కలిసేలా విజ్ఞప్తి చేస్తున్నారు. లొంగిన వారికి గౌరవప్రదమైన పునరావాసం, భద్రత మరియు సమర్థవంతమైన పునరావాస పథకాలను తెలంగాణ ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలు కాలం చెల్లిపోయినవిగా మారిపోయి, ప్రజలను మభ్యపెడుతూ అమాయకుల వద్ద నుండి వసూళ్ల పేరుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన వారిని మావోయిస్టులు పోలీసులు ఇన్ఫార్మర్లుగా ముద్ర వేస్తూ హతమారుస్తున్నారని పోలీసు శాఖ వివరించింది.
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి సహకరించడం, అందులో భాగస్వామ్యం కావడం ద్వారా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఆటంకం కలిగించే వారి పై దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో DSP మణుగూరు వి.రవీంద్ర రెడ్డి, SHO చర్ల ఎ.రాజు వర్మ, SI ఆర్.నర్సిరెడ్డి, 141 Bn CRPF, మరియు 81 Bn CRPF అధికారులు పాల్గొన్నారు.